తిరుపతి (ఆగస్టు 11):
శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనం సృష్టించిన మగలంపాటి శివకుమార్, శివ హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు సాంకేతిక ఆధారాలతో వేగంగా ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర నేరచరిత్ర కలిగిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పాత కక్షలతోనే హత్య:
తమిళనాడుకు చెందిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు 'తొప్పై గణేశన్' చెన్నైలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించాడు. అయితే, గణేశన్ సమాచారాన్ని శివకుమారే పోలీసులకు ఇచ్చాడనే అనుమానంతో ప్రతీకారం తీర్చుకోవడానికే తమిళనాడుకు చెందిన వి. కార్తీక్, వి. గోపీనాథ్, బి. శ్రీధర్‌లతో పాటు పుత్తూరుకు చెందిన ఎమ్. సూర్యలు కలిసి స్వర్ణముఖి నది కట్టపై శివకుమార్‌ను కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు.
నిందితుల అరెస్ట్ – వాహనాలు స్వాధీనం:
ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన యమహా ఆర్15 మోటార్ సైకిల్, రెండు కత్తులు మరియు రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
పిడి యాక్ట్ నమోదు:
పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. నిందితులపై 'పిడి యాక్ట్' నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసును వేగవంతంగా ఛేదించిన అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి డీఎస్పీ కె. నరసింహమూర్తి మరియు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఎస్పీ అభినందించారు.

