రేణిగుంట ఆగష్టు 10. అప్పుల భారం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. కుటుంబ పోషణ, చేసిన అప్పులు తీర్చడం భారంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం, ముత్తరపల్లి గ్రామానికి చెందిన కె. చిరంజీవి (24) రేణిగుంట పరిధిలోని వెంకటాపురం గ్రామం వద్ద గల ఒక ఇటుకల తయారీ కేంద్రంలో కూలి పనులు చేస్తూ, అక్కడే నివాసముంటున్నాడు. చిరంజీవికి వివాహ సమయంలో సుమారు రూ. 4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ఆ అప్పులను తీర్చేందుకు రాత్రింబవళ్లు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ, అప్పుల భారం క్రమంగా పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఈ నెల 9న రాత్రి తన సోదరి చందనకు ఫోన్ చేసిన చిరంజీవి... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తీర్చడం తనకు చాలా కష్టంగా ఉందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆగస్టు 10న తెల్లవారుజామున సుమారు 3.30 గంటల ప్రాంతంలో పక్కనే నివాసముంటున్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తాము నివాసముంటున్న రేకుల షెడ్డు పైకప్పు ఐరన్ రాడ్‌కు చీరతో ఉరివేసుకుని చిరంజీవి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని భార్య యం. నాగవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన భర్త మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని, అప్పుల బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని భార్య ఫిర్యాదులో పేర్కొంది. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన పోలీసులు, అనంతరం భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
