తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, నేరాల నివారణ, రోడ్డు భద్రత, మహిళలు మరియు చిన్నారుల రక్షణ లక్ష్యంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఓబులవారిపల్లి మండలం మంగంపేట, ఎల్లాయపల్లి, వై.కోట పంచాయతీ, చిట్వేల్ మండలం సిద్ధారెడ్డిపల్లి, పుల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపక్కాగారిపల్లి, రేణిగుంట ఆర్టీసీ బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి, డిక్సన్ ప్లాంట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు ప్రజలు, విద్యార్థులు, యువత, కార్మికులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాల్లో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలు, చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ దొంగతనాల నివారణ, మహిళల భద్రత, శక్తి యాప్, డయల్-112 సేవల వినియోగం, బాల్య వివాహాల నిర్మూలన, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు.
అదేవిధంగా మైనర్లు వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసు సేవలు అవసరమైనప్పుడు డయల్-112ను వినియోగించాలని ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలు, సైబర్ మోసాలు లేదా ఇతర నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

