ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం కోరిన పోలీసులు.
తిరుపతి జూలై 30: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో మానవ అక్రమ రవాణా, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, ఒటిటి /ఆన్లైన్ మోసాలు, నకిలీ ఏపీకె ఫైళ్ల ద్వారా జరిగే మోసాలు, మహిళల భద్రత, హెల్మెట్ వినియోగం, నేరాల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే అనుమానాస్పద కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల విక్రయాలు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-112 లేదా సైబర్ హెల్ప్‌లైన్ 1930కు సమాచారం అందించాలని సూచించారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పుకార్లను నమ్మకుండా, సోషల్ మీడియాలో నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., సందేశం ఇస్తూ, "ప్రజల భద్రత, యువత భవిష్యత్తు పరిరక్షణ మరియు నేరరహిత సమాజ నిర్మాణమే తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత వంటి అంశాలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరిస్తేనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుంది. ఏదైనా అనుమానాస్పద సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేసి బాధ్యతాయుత పౌరులుగా సహకరించాలి." అని అన్నారు.*

