తిరుపతి జూలై 30: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే భక్తులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని అలిపిరి సమీపంలో హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 78 మంది వాహనదారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.78,000 జరిమానా విధించారు.
అనంతరం వాహనదారులకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణలో దాని ప్రాధాన్యత, మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ప్రయాణంలో ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, "హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే రక్షణ కవచం. జరిమానా విధించడం పోలీసుల లక్ష్యం కాదు; ప్రమాదాలను నివారించడం, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి" అని సూచించారు.*
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమించే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాఫిక్ సీఐ హరి ప్రసాద్, ఎస్ఐలు మరియు తిరుమల ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
