
మన ధ్యాస,నిజాంసాగర్ , జుక్కల్ ఎన్నో రోజులుగా నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు తాజాగా మళ్లీ జలకళను సంతరించుకుంది. గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో రాత్రింబవళ్లు కురుస్తున్న వర్షాల ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు చేరడం ప్రారంభమైంది.సంగారెడ్డి, నారాయణఖేడ్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి వాటి నీరు నిజాంసాగర్ వైపు చేరుతోంది. బుధవారం ఉదయం నాటికి ప్రాజెక్టులోకి 6,585 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1,395.40 అడుగులు ఉండగా, 7.139 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ సీజన్లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందగా, ఇప్పుడు ప్రాజెక్టులోకి వరద నీరు చేరడం ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి లభ్యత మెరుగుపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.