తవణంపల్లి జూలై 24 మన ధ్యాస (నాగరాజ సరకింటి )
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమం 24.7.26 తేదీన అరదొండ బాలుర ఉన్నత పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై తమ పిల్లల విద్యాభివృద్ధి గురించి తెలుసుకోవడంలో ఆసక్తి కనబరిచారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటేశ్వర చౌదరి, అరగొండ ఆంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ రఘుపతి, సింగిల్ విండో అధ్యక్షుడు రంజిత్ రెడ్డి , జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్ర కుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ చౌదరి, మండల విద్యాశాఖ అధికారి హేమలత, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి సురేష్ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తల్లిదండ్రులు పిల్లల విద్యపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం ప్రతి తరగతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థుల సమగ్ర ప్రగతి పత్రాలను వివరించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తన, క్రమశిక్షణ, ప్రతిభ, అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి తల్లిదండ్రులకు విపులంగా వివరించారు. తల్లిదండ్రులు కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకొని విలువైన సూచనలు అందించారు.
తదుపరి తల్లిదండ్రుల కోసం వినోదాత్మక పోటీలు నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కార్యక్రమం మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.