
ప్రజలకు సత్వర సేవలు అందించాలి.. నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించం...ప్రజాసేవలో నిర్లక్ష్యానికి తావులేదన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
కలిగిరి, జూలై 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, భూ సంబంధిత సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్య ధోరణి, కార్యాలయ నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతి పౌరుడికి సమయానికి సేవలు అందించడం అధికారుల ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు.రెవెన్యూ శాఖలో ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించి, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఇకపై ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు.
