
రాష్ట్ర సుభిక్షం, రైతాంగ సంక్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ .వెంగమాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కాకర్ల..
దుత్తలూరు జులై 8, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా, భక్తి పారవశ్య వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ తిరునాళ్లలో భాగంగా ఈరోజు నిర్వహించిన శ్రీ వెంగమాంబ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం వేదోక్తంగా జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా నర్రవాడ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల నడుమ మంగళ వాయిద్యాలతో, పూర్ణకుంభ స్వాగతంతో ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా వెంగమాంబ అమ్మవారి ప్రతిమతో ప్రత్యేకంగా రూపొందించిన టీ-షర్టులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా భక్తులకు, యువతకు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే అమ్మవారి హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి, భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా భావించే అమ్మవారికి ఎండు కొబ్బరిని సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, రవాణా, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. భక్తులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తూ తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం నర్రవాడలో నిర్వహించిన ఆర్యవైశ్య అన్నదాన సమాజం 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజం గత ఎన్నో దశాబ్దాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న అన్నదాన సేవలను, సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంగమాంబ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
