
దుత్తలూరు, జూలై 08, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనతో పాటు టిడిపి యువ నాయకులు బొల్లినేని కార్తీక్ మరియు ఇండియా–ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ చైర్మన్ బొల్లినేని ధనుష్ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థానం ఈవో రామారావు బొల్లినేని వెంకట రామారావు కి సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, వెంగమాంబ అన్నదాన సత్రం, హైదరాబాద్ నిర్వాహకులు బొల్లినేని వెంకట రామారావు ని ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అలాగే ఆలయ సంరక్షణ సమితికి మద్దతుగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.

ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ, "ఆలయాలు మన సంస్కృతి, సనాతన ధర్మానికి ప్రతీకలు. శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.
అలాగే, "నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలం నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటూ వస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం అందించాను. ఆలయాల అభివృద్ధి, ధార్మిక సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల సహకారంతో ఈ పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక వైభవంతో వెలుగొందాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
