
సంక్షేమ కార్యక్రమాలకు 1,086,87 కోట్లు కేటాయించాం...పరిశ్రమలతో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాము...కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం..
ఉదయగిరి, జూలై 06 (మన న్యూస్ ప్రతినిది నాగరాజు కె).
ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. గత రెండేళ్లలో ఉదయగిరి సంక్షేమం కోసం రూ.1,098.79 కోట్లు కేటాయించామని, ఇప్పటికే నాలుగు పరిశ్రమలకు ఆమోదం లభించగా వాటి ద్వారా సుమారు నాలుగు వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి సోమవారం ఉదయగిరికి చేరుకున్న మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి, దర్గా సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, యువనేత నారా లోకేష్ కృషితో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు రప్పించగలిగామని పేర్కొన్నారు.ఉదయగిరి ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతమని, పరిశ్రమలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని విమర్శించిన మంత్రి, టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని తిరిగి గాడిలో పెడుతోందన్నారు. గతంలో మూసివేసిన అన్నా కాంటీన్లను తిరిగి ప్రారంభించి రోజుకు 2.25 లక్షల మంది పేదలకు భోజనం అందిస్తున్నామని తెలిపారు. అలాగే 2014లో రూ.38 వేల కోట్లతో ప్రారంభించిన 7 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వం 2.5 లక్షల ఇళ్లకే పరిమితం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో రాష్ట్ర పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని చెప్పారు.వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి కొనియాడారు.తాను కూడా “నారాయణ నేత్రజ్యోతి” కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ రాకతో ఉదయగిరి అభివృద్ధికి మరింత వేగం వస్తుందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి రూపురేఖలు మారిపోతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉదయగిరిలో అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ కృషితో పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని, ఉదయగిరి–సీతారాంపురం మండలాలకు తాగు, సాగునీటి శాశ్వత పరిష్కారం అందిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కలిగిరి–సంగం రోడ్డు పనులు ప్రారంభించడం, దుత్తలూరు–కావలి రోడ్డు సమస్య పరిష్కారం, నందవరం–ఉదయగిరి రోడ్డుకు నిధుల కేటాయింపు, బనగానపల్లి రోడ్డుకు అటవీ శాఖ అనుమతుల సమస్య పరిష్కారం, ఉదయగిరిలో మరో అన్నా కాంటీన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతమ్మ, టీడీపీ నేతలు చెంచల బాబు యాదవ్, చిరంజీవి రెడ్డి, బాబు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 8 మండలాల టీడీపీ అధ్యక్షులు, జనసేన,బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
