గాజులమండ్యం (రేణిగుంట రూరల్): గాజులమండ్యం పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 1,16,970/- విలువైన 3,342 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట రూరల్ సి.ఐ ఎం. మంజునాథ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీస్ఆ దేశాలు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు సూచనలతో ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
యర్రమరెడ్డి పాల్యం మార్గంలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో గాజులమండ్యం ఎస్.ఐ ఎస్. హరీష్, పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టామని సి.ఐ వివరించారు. ఆ సమయంలో బొలెరో, ఆటో, బైక్‌లపై బియ్యంతో వస్తూ, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఎం. శివానందం, కె. ప్రేమ కుమార్, ఎం. సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని విలేజ్ రెవెన్యూ అధికారుల సమక్షంలో రేషన్ బియ్యంగా ధృవీకరించామని సి.ఐ పేర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ ధరకు కొని, ఎక్కువ రేట్లకు విక్రయించేందుకు వీటిని తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వాహనాలను సీజ్ చేశామని, మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సి.ఐ మంజునాథ రెడ్డి స్పష్టం చేశారు
