"రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టండి.. సమాచారం ఉంటే 'డయల్ 112' కి పిలవండి: రేణిగుంట పోలీసులు"
"పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఉక్కుపాదమే…రేణిగుంటఅర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరిక"…
రేణిగుంట జూన్ 30.
ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ, నిల్వ చేస్తున్న ఒక పెద్ద ముఠాను రేణిగుంట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ దాడిలో, ముఖ్యంగా రేణిగుంట పోలీస్ స్టేషన్ సీఐ ఎస్. జయచంద్ర ఆదేశాల మేరకు పోలీసులు ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. నియోజకవర్గంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా చేయాలనే సంకల్పంతో సీఐ జయచంద్ర నిరంతరం నిఘా ఉంచారు. ఆయన పక్కా ప్రణాళిక మరియు ఆదేశాల ప్రకారం ఎస్సై వై. శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బంది ఉదయం సుమారు 11 గంటలకు చెంగారెడ్డిపల్లి క్రాస్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో శ్రీకాళహస్తి వైపు నుండి చెంగారెడ్డిపల్లి వైపు వస్తున్న ఏపీ 39 టీయూ 8938 నంబర్ గల వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, డ్రైవర్ బండిని ఆపకుండా చెంగారెడ్డిపల్లి గ్రామం చివరనున్న డెల్మాన్ ఫంక్షన్ హాల్ వద్ద నిలిపి, అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీస్ సిబ్బంది వారిని వెంటాడి పట్టుకొని, పంచాయతీదారుల సమక్షంలో నిలదీశారు. విచారణలో పట్టుబడిన వారి పేర్లు సి. రాజా (20 సంవత్సరాలు), గురువేంద్ర (24 సంవత్సరాలు), మరియు చల్ల గోపాల్ వైశ్యరి (26 సంవత్సరాలు) అని తెలిసింది. వీరంతా తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిలకవారి కండ్రిగ గ్రామానికి చెందినవారు. శ్రీకాళహస్తికి చెందిన మణి అనే ప్రధాన సూత్రధారి చెబితేనే తాము ఈ పని చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని ప్రజల వద్ద నుంచి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని, అక్కడ నుంచి చెంగారెడ్డిపల్లికి అక్రమంగా తరలించి ఒక గోదాములో నిల్వ చేశామని, అక్కడ నుంచి తమిళనాడుకు తరలించి ఎక్కువధరకు అమ్ముకోవడానికి ప్లాన్ చేసినట్లు అంగీకరించారు. పోలీసులు తనిఖీ చేయగా వాహనంలో 79 బస్తాలు (3,792 కిలోలు), గోదాములో 147 బస్తాలు (7,328 కిలోలు) దొరికాయి. మొత్తంగా 226 బస్తాలలో ఉన్న 11,120 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ సుమారు రూ. 2,50,000 ఉంటుందని అంచనా వేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేస్తూ ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ, పేద ప్రజల పొట్ట కొట్టి, ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి సొమ్ము చేసుకోవాలని చూస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అప్పగించామని, తదుపరి దర్యాప్తు వేగవంతం చేశామని ఆయన తెలిపారు. అలాగే ప్రజలకు ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా లేదా నిల్వ గురించిన సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని సీఐ జయచంద్ర పిలుపునిచ్చారు. ఈ విజయవంతమైన దాడిలో సీఐ ఆదేశాల మేరకు ఎస్సై శ్రీనివాసులు మరియు రేణిగుంట పోలీస్ సిబ్బంది చురుగ్గా పాల్గొని ప్రతిభ కనబరిచారు.

