మొక్కు తీర్చుకునేందుకు ఊరందూరు నుండి తిరుమలకు కాలినడకన పాదయాత్ర ప్రారంభం...
రేణిగుంట వద్ద గజమాలలతో ఘన స్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నాయకులు కాపిరెడ్డి నాదముని రెడ్డి..
పాదయాత్ర మార్గంలో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు...
రేణిగుంట మనం:
"రాజకీయాల్లో విజయం అంటే కేవలం ఒక వ్యక్తి గెలవడం కాదు.. అది వేలాది మంది ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతిరూపం.. అలాగే ఆ భగవంతుడు అందించిన ఆశీస్సుల బలం" అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజల నిరంతర ఆదరణ, దైవానుగ్రహం వల్లే సుధీర్ రెడ్డి ఎన్నికల్లో 43 వేల ఓట్ల భారీ మెజారిటీతో తిరుగులేని, చారిత్రాత్మక విజయాన్ని సాధించారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు శనివారం ఉదయం శ్రీకాళహస్తి రూరల్ మండలం ఊరందూరు గ్రామం నుండి తిరుమల వెంకన్న సన్నిధికి ఆమె కాలినడకన పాదయాత్రను అత్యంత వైభవంగా ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ‘గోవింద నామ’ స్మరణతో భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు.
ఈ పాదయాత్ర రేణిగుంట పరిధిలోని వెంకటాపురం వద్దకు చేరుకోగా, టీడీపీ సీనియర్ నాయకులు కాపిరెడ్డి నాదముని రెడ్డి ఆధ్వర్యంలో రిషితా రెడ్డికి గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యకర్తల కష్టం, బొజ్జల కుటుంబంపై ప్రజలకున్న ఆదరణే ఈ విజయానికి కారణమన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇదే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు కావడంతో, పాదయాత్ర మార్గంలోనే కేక్ కట్ చేసి ఆమెకు రిషితా రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఆధ్యాత్మికత, రాజకీయ చైతన్యం కలగలిసిన ఈ భారీ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కాపిరెడ్డి నాదముని రెడ్డితో పాటు విభిన్న అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు మరియు బొజ్జల అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

