యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యం.డ్రగ్స్ వినియోగంపై అవగాహనతో పాటు కౌన్సిలింగ్ కార్యక్రమాలు. “డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా” లక్ష్యంతో పోలీసుల నిరంతర ప్రత్యేక చర్యలు.
తిరుపతి క్రైమ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్., ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా తిరుపతి నగరంలోని నెహ్రూ మునిసిపల్ హైస్కూల్లో మెగా గంజాయి నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు.
తిరుపతి సబ్ డివిజన్ పరిధిలోని ఈస్ట్, వెస్ట్, అలిపిరి మరియు ఎస్వీయూ పోలీస్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో మొత్తం 300 మంది విద్యార్థులకు బయో-చెక్ కిట్ల ద్వారా గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 84 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, అందరి ఫలితాలు నెగెటివ్‌గా నమోదయ్యాయి.
అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 93 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు విద్యార్థులు పాజిటివ్‌గా గుర్తించబడ్డారు.
వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 87 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, అందరి ఫలితాలు నెగెటివ్‌గా నమోదయ్యాయి.
ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో 36 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, అందరి ఫలితాలు నెగెటివ్‌గా నమోదయ్యాయి.
పరీక్షల్లో పాజిటివ్‌గా గుర్తించిన విద్యార్థులకు సంబంధిత నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు చేపట్టారు.
అలాగే, శుక్రవారం స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో మత్తు పదార్థాల వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ వారితో ప్రత్యేక ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవత్సలం మాట్లాడుతూ, “గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మొదటిసారి తప్పు చేసిన వారికి అవగాహన కల్పించి కౌన్సిలింగ్ అందిస్తాం. అయితే రెండోసారి మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదకరమైన అలవాటని, యువత తమ లక్ష్యాలపై దృష్టి సారించి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 (ఈగల్) లేదా అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మరియు పోలీస్ శాఖ సమిష్టి కృషితోనే “డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా” లక్ష్యాన్ని సాధించగలమని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవత్సలం , సంబంధిత సీఐలు రామ్ కిషోర్ (అలిపిరి), రామకృష్ణ (వెస్ట్), శ్రీనివాసులు (ఈస్ట్), ఈగల్ సీఐ, ఎస్ఐలు, ఈగల్ సెల్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

