తిరుపతి , జూన్ 5 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ పథకాలను యువత సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద "వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్" కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్‌ను శుక్రవారం ఉదయం కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వ పథకాల సహకారంతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎంఎస్ఎంఈ రంగం ద్వారా ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగవచ్చన్నారు. శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్లో జపాన్ సాంకేతికతతో కూడిన ఆధునిక పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాల రంగులను ఉపయోగించి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. ఇటువంటి పరిశ్రమలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
బిగ్ ప్రింట్స్ సంస్థ అధినేత, హరిబాబు మద్దినేని మాట్లాడుతూ, "వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్" కార్యక్రమంలో భాగంగానే శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్‌ను స్థాపించినట్లు ఈ సంస్థ నుండి అన్ని రకాల ప్రింటింగ్ ఉత్పత్తులు అందిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంస్థను సందర్శించడం ఆనందంగా ఉందని, ఈ సంస్థ ద్వారా తనతో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలగడం సంతోషకరమని పేర్కొన్నారు.

