రేణిగుంట జూన్ 5
తిరుపతి నగర పరిధిలో విద్యా సంస్థలకు చెందిన బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ తనిఖీలను ఆరు బృందాలుగా విభజించబడిన మోటార్ వాహన తనిఖీ అధికారులు నిర్వహించారు.
ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో సుమారు 850 విద్యాసంస్థల బస్సులను పరిశీలించగా, సాంకేతిక లోపాలు ఉన్న 75 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, మరమ్మత్తులు చేపట్టి వాహనాలను తిరిగి తనిఖీకి సమర్పించాలని సంబంధిత యాజమాన్యాలను ఆదేశించారు.
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 185(జి ) ప్రకారం పాఠశాల మరియు కళాశాల బస్సులకు వర్తించే అదనపు భద్రతా నిబంధనల కింద పేర్కొన్న 32 ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు సూచించారు.
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని బస్సులు అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసి, ఫిట్నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరించుకొని మాత్రమే రోడ్లపై నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి సూచించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మోటార్ వాహన చట్టాలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.
తనిఖీల సందర్భంగా అధికారులు ముఖ్యంగా క్రింది అంశాలను పరిశీలించారు:
విద్యార్థుల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
భద్రతా ప్రమాణాలను పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ తనిఖీలలో మోట వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, అతికా నాజ్, మోహన్ కుమార్, ఆంజనేయ ప్రసాద్, రమణ నాయక్ మరియు జిల్లాలోని మోటర్ వాహన తనిఖీ అధికారులు అందరూ
పాల్గొన్నారు.



