పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరం
*జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్*
తిరుపతి, జూన్ 05: మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట (తూకివాకం) సమీపంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జే సి ఆర్. గోవింద రావు, తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డి కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. చెట్లు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ, నీరు పోయడం, ఎరువులు, క్రిమి సంహరక మందులు వేయడం వంటి చర్యలు తీసుకోకపోతే మొక్కలు జీవించవన్నారు. చెట్ల సంరక్షణలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలని సూచించారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయని, సాధారణంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.4 డిగ్రీలుగా ఉండగా, ప్రస్తుతం 15 డిగ్రీలు దాటితే తీరప్రాంతాల్లో నివసించే మూడో వంతు జనాభా తీవ్ర ప్రభావానికి గురవుతుందన్నారు. ఈ కారణంగా చేపల వేట ఇబ్బందికరంగా మారి తీరప్రాంత జీవనోపాధులు దెబ్బతింటాయన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సీడ్ పెల్లెట్స్ కార్యక్రమాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారన్నారు. విత్తనాలను సహజ పదార్థాలతో (ఆవుపేడ, ఇతర జీవామృతాలు) కలిపి చిన్న గుళికల రూపంలో తయారు చేసి నాటడం ద్వారా వర్షాభావం ఉన్నా, నీరు తక్కువ ఉన్నా మొక్కలు ఎక్కువ కాలం జీవిస్తాయని, ఈ విధానం ద్వారా మొక్కల జీవన శాతం పెరుగుతుందన్నారు. తిరుపతి, శేషాచలం కొండల్లో ఉన్న చెట్ల కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా చెట్లు నాటడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించవచ్చన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలందరూ కలసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారన్నారు. విద్యార్థులను ఉద్దేశించి పర్యావరణ పరిరక్షణలో వారి పాత్రను వివరించారు. పిల్లలు చిన్న వయసులోనే చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం అలవాటు చేసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో పచ్చదనాన్ని పెంపొందించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సూచనల మేరకు జూన్ 5న జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. చెట్లు నాటడం మాత్రమే కాకుండా వాటిని పెంచడం, సంరక్షించడం కూడా అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి మనిషి ఏ రంగంలో స్థిర పడినా పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇంటి వద్ద, పాఠశాలల్లో, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని సూచించారు. చెట్లు నరికే పరిస్థితి వచ్చినప్పుడు, దానికి బదులుగా కొత్త చెట్లు నాటడం ద్వారా ప్రకృతిలో సమతుల్యతను నిలుపుకోగలమన్నారు.
తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ చెట్లు నాటడంతో పాటు వాటి సంరక్షించడం కూడా అత్యంత ప్రధానం అని ఈ కార్యక్రమంలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. ఇంటి వద్ద, పాఠశాలల్లో, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటడం ద్వారా కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని సూచించారు. చిన్నతనం నుండే మొక్కలు నాటడం ప్రారంభిస్తే, భవిష్యత్తులో అదొక గొప్ప అలవాటుగా మారుతుందన్నారు. ప్రస్తుతం ఇందన కొరత ఉన్న తరుణంలో సౌర శక్తి వినియోగం, బ్యాటరీ వాహనాల వినియోగం ద్వారా కాలుష్య నివారణ సాధ్యమవుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రం గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందిందని, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా గ్రీన్ సిటీగా మారే విధంగా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. దేశ పరిరక్షణలో సైనికులు శ్రమిస్తున్న తీరులోనే యువత కూడా తమ పరిసర ప్రాంతాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కు నడుం బిగించాలనరు.

