రేణిగుంట జూన్ 3.
రేణిగుంట మండలం పరిధిలోని కోడూరు–రేణిగుంట జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ముఖాముఖి ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవ్వగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వివరాలను రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (సీఐ) జయచంద్ర మీడియాకు వెల్లడించారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం… తాడిపత్రి ప్రాంతం నుండి అల్ట్రాటెక్ సిమెంట్ లోడుతో తమిళనాడు వైపు వెళ్తున్న బాలగణపతి ట్రాన్స్పోర్ట్కు చెందిన లారీ (నెంబర్ టీన్ 47 బి.వి 8053) బుధవారం వేకువజామున సుమారు 1:30 గంటల సమయంలో మండూరు గ్రామం సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో లారీ డ్రైవర్ తీవ్ర నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుకు కుడివైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రెండు లారీలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
ఈ ఘోర ప్రమాదంలో సిమెంట్ లారీని నడుపుతున్న తమిళనాడు రాష్ట్రం, తంజావూరు తాలూకా, రామాపురం గ్రామానికి చెందిన డ్రైవర్ మాధవన్ (30) క్యాబిన్లో నలిగిపోయి, తీవ్ర రక్తగాయాల కారణంగా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో లారీ డ్రైవర్ బాలస్వామి (48) తలకు బలమైన గాయాలు కావడంతో లారీలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే రేణిగుంట పోలీసులు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన బాలస్వామిని క్షేమంగా బయటకు తీసి, 108 అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందుతోంది.
మృతుడు మాధవన్ భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ మార్చురీకి తరలించినట్లు సీఐ జయచంద్ర తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించామన్నారు. ఈ ఘటనపై రేణిగుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.


