సిద్దేశ్వరం అలుగు కోసం సీమ రైతాంగ పోరాటానికి 10 సంవత్సరాలు.
సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2016 మే 31 న ఇదే రోజు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం 25 వేల మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజా శంకుస్థాపన చేసిన రోజు. రాజకీయ పార్టీల అండలేకుండా , ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రతిగటిస్తూ ప్రజాస్వామిక చారిత్రక పోరాటం అది.
సిద్దేశ్వరం నేపద్యం……
సిద్దేశ్వరం రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం. దాదాపు 9 దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. పలితం రతణాల సీమగా ఉండాల్సిన రాయలసీమ నేడు కరువుసీమగా మారి ప్రపంచం ముందు సాయం కోసం దీనంగా నిలబడిన దైన్యస్దితి. 1911-12 ప్రాంతములోనే ఆంగ్లేయుల కాలంలో మెకన్జి సిపార్సుల మేరకు సిద్దేశ్వరం సర్వేచేసి నిర్మాణానికి అంగీకారం తెలిపారు. తదనంతరం 1958 ప్రాంతములో భారత ప్లానింగ్ కమీషన్ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
రాయలసీమకు 18 లక్షల ఎకరాలకు, నాటి తమిళనాడుకు 5 లక్షల ఎకరాలకు మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా దాదాపు 250 టీఎంసీ ల సామర్ద్యం తో ప్రాజెక్ట్ ను రూపొందించారు. అదే జరిగి ఉంటే నేడు రాయలసీమకు 250 టీఎంసీ ల నికరజలాలు హక్కుగా మారి ఉండేది. అంతేకాదు సీమ మొత్తం వ్యవసాయం వృద్ది చెంది దానికి అనుబందంగా పరిశ్రమలు, అపార ఖనిజ సంపద, వాతావరణ అనుకూల పరిస్దితుల నేపద్యంలో గణనీయమైన అబివృద్ది సాదించి భారతదేశం లోనే అత్యంత అబివృద్ది చెందిన ప్రాంతముగా నేడు మన రాయలసీమ ఉండేది. అందుకే సిద్దేశ్వరం నిర్మాణం రాయలసీమ నీటి అవసరాలకు అత్యంత ముఖ్యం.
నికర జలాలు ఉన్నా అనుబవించలేని దుస్దితి….
రాయలసీమకు నికరజలాల కేటాయింపులో అన్యాయం జరిగింది. అదే సందర్బంలో ఉన్న 133.7 టీఎంసీ లలో కనీసం సగం నీటిని వాడుకోలేక పోతున్నాము. ప్రాజెక్ట్ లవారిగా పరిసీలిస్దే
1 హెల్సీ ఈ తుంగబద్రా హైలెవల్ కెనాల్ కి ఉన్న 32.5 టీఎంసీ లో 17,18 టీఎంవీ లు మాత్రమే వాడుకుంటున్నాము.
2 LLC 29.5 టీఎంసీ లలో 11 టీఎంసీ లు మాత్రమే వాడుకుంటున్నాము.
3 కేసీ కెనాల్ కు 39.9 టీఎంసీ లు ఉండగా ప్రభుత్వాలు కాకి లెక్కలు చెప్పి 50,60 టీఎంసీ లు డ్రా అవుతున్నట్లు చూపిస్తున్నారు. కాని వాస్దవం లో 15 టీఎంసీ లు మాత్రమే వాడుకుంటున్నాము.
4 బైరవాన్ తిప్పా 4.9 టీఎంసీ లలో కేవలం 0.5 టీఎంసీ లు వాడుకుంటున్నాము.
5 ఎస్ ఆర్ బి సి లో 19 టీఎంసీ లు ఉన్నా అందులో ఉపయోగించు కుంటున్నది 7,8 టీఎంసీ లు మాత్రమే.
స్దూలంగా చెప్పాలంటే సీమకు అధికారికం గా, హక్కుగా ఉన్న 133.7 టీఎంసీ లలో మనం దాదాపు సగం అంటే 65 టీఎంసీ లను వాడుకోవడంలేదు. దీని కరీదు వరి పంట అయితే కనీసం 5,6 లక్షల ఎకరాలు, అదే డ్రిప్ లాంటి వ్యవసాయం అయితే 13 లక్షల ఎకరాలు పంటనీటిని వాడుకోలేని పరిస్దితి. ఇవి కాక శ్రీశైలం లోని క్యారి ఓవర్ క్రింద 60 టీఎంసీ లు, పట్టిసీమ నిర్మాణం ద్వారా 45 టీఎంసీ లు, పులిచింతల ద్వారా ఒప్పందం మేరకు 54 టీఎంసీ లను మనం వాడుకోవాలి. అంటే దాదాపు 159 టీఎంసీ ఇంకా రాయలసీమ వాడుకోవడానికి అవకాశం ఉంది. అధికారికంగా ఉన్న 133.7 టీఎంసీ లనే వాడుకునే ఏర్పాట్లు లేనపుడు ఇంకా అవకాశం ఉన్న 159 టీఎంసీ లను ఎలా వాడుకోవాలి. రెండు కారణాల వలన సీమ ప్రాంతం నీటిని వాడుకోలేక పోతుంది. 1 నీటి నిల్వ చేసుకునే ఏర్పాట్లు తగినంతగా సీమలో లేవు. 2 అవకాశం ఉన్న శ్రీశైలం లో 854 అడుగుల ఎత్తుకు నీటిని ఉంచకుండా 69 జీఓ ద్వారా 834 అడుగుల వరకు నీటిని క్రిష్ణా డెల్టాకు తీసుకు వెలుతుండటం వలన సీమకు నీటి కష్టాలు వచ్చాయి. అందుకే 1. జీఓ నెం 69 ని రద్దు చేసి శ్రీశైలం నీటి మట్టాని 854 అడుగులు ఉండేలా చూడటం. 2. శ్రీశైలంకి 86 కీలోమీటర్ల పైన 860 అడుగల ఎత్తులో సిద్దేశ్వరం అలుగును నిర్మించాలి.
సిద్దేశ్వరం అలుగు ప్రయోజనం….
సిద్దేశ్వరం అలుగును శ్రీశైలం కు పైన నిర్మిస్దాం కాబట్టి 50 టీఎంసీ ల నీటిని నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సిద్దేశ్వరం అలుగు కాబట్టి క్రిష్ట నీరు సిద్దేశ్వరం పొంగిన తర్వాతనే శ్రీశైలం కు వెలుతుంది. అంటే కచ్చితంగా 50 టీఎంసీ లు నీరు నిల్వ ఉంటుంది. బ్యాక్ వాటర్ తో పనిచేసే పోతిరెడ్డి పాడు 842 అడుగులు కాబట్టి కనీసం 19 అడుగుల నీరు చేరి తెలుగు గంగా, గాలేరు-నగరి, ఎస్ ఆర్ బి సి లకు నీటి సమస్య పరిష్కారమవుతుంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పధకానికి నీటి సమస్య రాకుండా ఉండటంతో బాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా బైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ కు కూడా నీరు ఇవ్వవచ్చు.
సిద్దేశ్వరం పై అనుమానాలు- వాస్దవాలు….
దేశంలోని ఏ ప్రాజెక్టు కూడా అడ్డంకులు లేకుండా నిర్మాణం పూర్తి కాలేదు. నేడు పోలవరం నిర్వాసితుల సమస్య , తెలంగాణ , చత్తీస్ ఘడ్ , ఒడిశా రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. సమస్యలు ఎదుర్కొంటునే ముందుకు వెళుతున్నాము. సిద్దేశ్వరం కూడా అలానే పరిష్కరించబడుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ లో అంతర్బాగంగా మరో ప్రాజెక్ట్ కు అనుమతి రాదు, పైన నీటిని నిల్వ ఉంచుకుంటే క్రిందికి నీరు రాదు కదా. అన్నది నేటి ప్రశ్నలు. మొదటది ఒక ప్రాజెక్ట్ లో అంతర్బాగంగా మరో ప్రాజెక్ట్ సాద్యం కాదు అంటున్న పెద్దలు పోలవరం కి అంతర్బాగంగా పట్టిసీమను ఎలా నిర్మించారు. ఇక రెండవ అనుమానం క్రిందకు నీరు పోదు కదా నిజమే కచ్చితంగా సిద్దేశ్వరం దగ్గర 50 టీఎంసీ లు నీరు ఉన్న తర్వాతనే క్రిందకు వెలుతుంది. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి అధికారికంగా సీమకు 133.7 టీఎంసీ లు ఉన్నాయి. సీమలో నీటి నిల్వకు తగిన ఏర్పాట్లు లేవు కనుక కనీసం 65 టీఎంసీ లు ను వాడుకోలేక పోతున్నాము. సీమ వాడుకోలేని ఆ నీరు ఆవిరి కాదు లేదా వెనకకు పోదు సీమ వాడుకోలేని నీరు సరాసరి శ్రీశైలం ద్వారా క్రిందకు వెలుతుంది. అంటే 60-70 టీఎంసీ ల నీటిని పైన నిలుపుకునే నైతిక హక్కు సీమకు ఉంది. సీమ పైన తెలంగాణ తో సహ మిగిలిన రాష్ట్రాలు ప్రాజెక్ట్ లు కడుతున్నారు. అవి తరవాత కాలంతో నికరజలాల ప్రాజెక్ట్ లుగా మారి పోతే సీమకు నీటి మీద కనీస హక్కును కోల్పోతాము. అందుకే ఒక సారి సిద్దేశ్వరం ప్రాజెక్ట్ ను కోల్పోయి దాదాపు 250 టీఎంసీ ల నికర జలాలను కోల్పోయాము. మల్లీ ఇప్పుడు ఆ చిన్నపాటి ప్రాజెక్ట్ ను కూడా సాదించుకోక పోతే సీమ బవితవ్యం ప్రమాదంలో పడక మానదు. అందువలన రాయలసీమ నీటి అవసరాలకు సిద్దేశ్వరం కచ్చితంగా కీలకం. దాన్ని సాదించు కోవడం రాయలసీమ ప్రజల కర్దవ్యం.
మారిన పరిస్తితులలో సిద్ధేశ్వరం అలుగు అవసరం ఎంతైనా ఉన్నది.. అనుమతులు పెద్ద సమస్య కాదు శ్రీశైలం ప్రాజెక్టు పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. అనేక నివేదికలు చెపుతుంది ఏమిటి అంటే.. ఇలా పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం పడిపోతే ఎగువబాగానా నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవచ్చు.. ఈ సిఫార్సులను ప్రభుత్వాలు ముందుకు తెస్తే అనుమతులు పెద్ద సమస్య కాదు.. మరో వైపు కేంద్రం ఇదే ప్రాంతం నుంచి జాతీయ రహదారి నిర్మాణం చేపడుతుంది.. అలుగు నిర్మాణం చేయాల్సిన ప్రాంతంలో తీగల వంతేన నిర్మాణం చేపట్టాలని ముందుకు వెళుతుంది.. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించ గలిగితే అనుమతులు, నిధుల సమస్య ఉండదు. వ్యక్తిగతంగా నాటి ఉద్యమంలో పాల్గొన్న నేను కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి సిద్ధేశ్వరం అలుగు అవశ్యకతను వివరిస్తే ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తె సానుకూలంగా ఉంటామని చెప్పారు.. సంబంధిత అధికారులకు వారు చెప్పిన మాట ఇంత మంచి ఒక ప్రాంతానికి జరిగితే నిబంధనలు కాదు చూడాల్సింది ఎలా చేయాలో ఆలోచించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి అని ఆదేశించారు. ప్రభుత్వాలు మనసు పెట్టీ ఆలోచిస్తే సిద్ధేశ్వరం అలుగు కళ సాకారం మరియు రాయలసీమ నీటి సమస్యకు కీలక పరిష్కారం లభిస్తుంది.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం
