ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 30, 2026, 7:49 pm
శరవేగంగా ‘తుడా టవర్స్’ నిర్మాణం..
నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు
క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, అధికారులకు తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి దిశానిర్దేశం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరానికే తలమానికంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘తుడా టవర్స్’ నిర్మాణ పనులను తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.
నిర్మాణ ప్రాంగణంలో కలియతిరుగుతూ ప్రతి దశను నిశితంగా గమనించిన ఆయన.. ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు కీలక సూచనలు, సలహాలు జారీ చేశారు.
భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని తుడా చైర్మన్ తేల్చి చెప్పారు.
అత్యున్నత సాంకేతికతను, ఆధునిక, మన్నికైన నిర్మాణ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలని అధికారులకు స్పష్టం చేశారు. "ఈ టవర్స్ భవిష్యత్ తరాలకు తుడా పనితీరుకు సజీవ సాక్ష్యంగా నిలవాలి" అని ఆయన ఆకాంక్షించారు.
నగర ప్రజలకు, వ్యాపార వర్గాలకు వీలైనంత త్వరగా ఈ టవర్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని,అందుకోసం పనుల వేగాన్ని రెట్టింపు చేయాలని ఆదేశించారు.
నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేయాలని, పనుల్లో ఎలాంటి జాప్యాన్ని లేకుండ త్వరిత గతిన పూర్తి చేయాలని తెలిపారు.
భవిష్యత్ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన, పకడ్బందీ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
భవనం నలుమూలలా గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా నిర్మాణ ప్రణాళికను తూచా తప్పకుండా పాటించాలన్నారు.
అత్యాధునిక అగ్నిమాపక భద్రతా వ్యవస్థను అత్యవసర మార్గాలను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్మించాలన్నారు.
నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ప్రతి కార్మికుడి ప్రాణరక్షణ ముఖ్యమని,నిర్మాణ ప్రదేశంలో విధిగా రక్షణ చర్యలు,పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ విస్తృత స్థాయి పరిశీలన కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య, భూసేకరణ అధికారి సుజన, తుడా ప్లానింగ్,ఇంజనీరింగ్ అధికారులు మరియు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.