మన న్యూస్:తిరుపతి, క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ సహకారం అవసరమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆకాంక్షించారు.తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ బీఆర్ నాయుడు ని, దేవస్థానం ఈఓ జె.శ్యామలారావు ను టీటీడీ ఛైర్మన్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా క్రీడారంగాభివృద్ధికి సంబంధించిన సమస్యలపై వారిరువురికీ రవినాయుడు విన్నవించారు. హాకీ క్రీడకు విశేషాదరణ లభిస్తుందని,తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలోనున్న హాకీ అకాడమీని పునఃప్రారంభించాలని కోరారు.అలాగే శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల నిర్వహణకు టీటీడీ సహకరించాలని కాంక్షించారు. క్రీడారంగానికి టీటీడీ కూడా సహకరిస్తే తిరుపతి నుంచి అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారుచేసే అవకాశం ఉంటుందని వివరించారు. దీనిపై వారు కూడా సానుకూలంగా స్పందించి టీటీడీ నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు రవినాయుడు వెల్లడించారు.