రేణిగుంట మే 22.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆధ్వర్యంలో రేణిగుంట సబ్ డివిజన్ పోలీసులచే మహిళల భద్రత, మహిళ సాధికారత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులమండ్యం ఆర్పీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ మహిళ సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదు, సమాజ నిర్మాణానికి అత్యంత కీలకమైన శక్తి అని పేర్కొన్నారు. మహిళలు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తే కుటుంబాలు బలపడటమే కాకుండా సమాజం సురక్షితంగా, అభివృద్ధి దిశగా పయనిస్తుందని తెలిపారు.
మహిళలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. మహిళలపై వేధింపులు, గృహ హింస, సైబర్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి మహిళ ఆత్మగౌరవంతో, భద్రతతో జీవించే వాతావరణం కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మొదటి తప్పుకే రౌడీషీట్ నమోదు చేసి, పునరావృతమైతే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నారుల రక్షణ కోసం స్కూల్స్, కాలేజీలు, మహిళా సంఘాలతో కలిసి నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత సెల్‌ఫోన్ వినియోగాన్ని నియంత్రణలో ఉంచి, తమ సమయాన్ని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యక్తిత్వ వికాసానికి వినియోగించాలని పిలుపునిచ్చారు.
అత్యవసర సమయాల్లో మహిళలు మరియు ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ ‘శక్తి’ యాప్, డయల్-112, మహిళా సహాయ నెంబర్-181, సైబర్ హెల్ప్‌లైన్-1930, చైల్డ్ లైన్-1098 సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు.
“సమాజంలో జరిగే తప్పులను చూసి మౌనంగా ఉండకుండా ప్రతి పౌరుడు ఒక బాధ్యతగల వ్యక్తిగా వ్యవహరించి పోలీసులకు సమాచారం అందిస్తేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుంది. మహిళల భద్రత, యువత భవిష్యత్తు, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు , మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత , ఎస్బీ డీఎస్పీ గీతా కుమారి , గాజులమండ్యం, రేణిగుంట, ఏర్పేడు సీఐలు మంజునాథ్ రెడ్డి, జయచంద్ర, శ్రీకాంత్ రెడ్డి, ఎండీవో రవిచంద్ర, పీహెచ్సీ డాక్టర్ చక్రపాణి, సీడీపీవో కృష్ణవేణి, ఎస్సైలు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు ప్రజలు పాల్గొన్నారు.


