రేణిగుంటమన మే 21…
శ్రీకాళహస్తి నియోజకవర్గ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించి, ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద సుమారు రూ. 85 కోట్ల వ్యయంతో, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన 'హ్యాంగ్యో ఐస్ క్రీమ్స్' మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు.
పరమపూజ్య శ్రీమద్ విద్యాధీశ తీర్థ శ్రీపాద వడేర్ స్వామీజీ దివ్య సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.
తండ్రి బాటలో పారిశ్రామిక పురోగతి
గతంలో తన తండ్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి నియోజకవర్గానికి అనేక పరిశ్రమలను రప్పించి వేలాది మందికి ఉపాధి కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. నేడు అదే బాటలో శాసనసభ్యుడిగా ఒక ప్రతిష్టాత్మక ఫ్యాక్టరీని ప్రారంభించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు.
నిరుద్యోగులకు అండగా..
ఈ నూతన యూనిట్ ద్వారా సుమారు 300 మందికి పైగా స్థానిక యువతకు నేరుగా ఉపాధి లభించనుంది. రోజుకు 10 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడిచే ఈ భారీ ప్రాజెక్టు, ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిని భవిష్యత్తులో ఒక పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు
ఈ భారీ ప్రాజెక్టు శ్రీకాళహస్తికి రావడానికి పూర్తి సహకారం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, యువనేత మంత్రి నారా లోకేష్ కి మరియు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ కి ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తూ నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.


