
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం మే 19: ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త ఒకరోజు బంద్‌లో, జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం అందిందని డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు కె.రజిత తెలిపారు.ఈ బంద్ వల్ల ప్రజలకు,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.జిల్లాలోని ప్రతి ప్రధాన కేంద్రంలో కనీసం ఒక మెడికల్ షాప్ తప్పనిసరిగా తెరిచి ఉంటుందని తెలియచేశారు.ఈ బంద్ సమయంలోనూ జిల్లాలోని అన్ని ఆసుపత్రులు,నర్సింగ్ హోమ్‌లలో ఉండే మెడికల్ షాపులు యథావిధిగా పనిచేస్తాయని,కాబట్టి అత్యవసర మందుల కొరత తలెత్తే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. కార్పొరేట్ ఫార్మసీలైన 'మెడ్‌ప్లస్' యాజమాన్యం తాము ఈ బంద్‌లో పాల్గొనడం లేదని, జిల్లాలోని తమ అన్ని బ్రాంచ్‌లు సాధారణ రోజుల్లో లాగే పనిచేస్తాయని ప్రకటించినట్లు రజిత పేర్కొన్నారు. మరో ప్రముఖ సంస్థ 'అపోలో ఫార్మసీ' సైతం జిల్లాలోని తమ దుకాణాల్లో కనీసం 50 శాతం షాపులను తెరిచే ఉంచుతామని హామీ ఇచ్చిందని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మందులు సకాలంలో అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. బంద్ రోజున మందుల కొనుగోలులో ప్రజలకు ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే తక్షణమే అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. విశాఖపట్నం (సేల్స్ ) డ్రగ్స్ ఇన్స్పెక్టర్ యమ్. శ్రీనివాస రావు(మహారాణిపేట మరియు గోపాలపట్నం మండల పరిధిలో) 8884394949 నంబర్లో గానీ, విశాఖపట్నం (మ్యానుఫ్యాక్చరింగ్ ) డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వి.అభిప్రియ (విశాఖపట్నం రూరల్ , సీతమ్మధార,భీమిలి, ఆనందపురం మరియు పద్మనాభం మండల పరిధిలో )7382934332 మరియు విశాఖపట్నం (విజిలెన్సు)డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కె. కళ్యాణి (పెందుర్తి, గాజువాక,ములగాడ మరియు పెదగంట్యాడ మండల పరిధిలో) 7382934375నంబర్లో గానీ సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు కె. రజిత ఒక ప్రకటనలో తెలియజేశారు.