రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్ళ చెరువు పంచాయతీలో గత కొద్దిరోజులుగా ఉన్న తాగునీటి సమస్య శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో పరిష్కారమైంది.
గ్రామంలోని బోరు బావి కొంతమేర పూడిపోవడంతో నీటి లభ్యత తగ్గింది. ఇదే సమయంలో బోరు మోటారు, స్టార్టర్ కూడా కాలిపోవడంతో గ్రామస్థులకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సూచనలతో అధికారులు మరమ్మతులు పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరించారు. గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీలో మోటారు చెడిపోయి, పైపులు దెబ్బతిన్నప్పుడు ఎమ్మెల్యే చొరవతో కొత్త పైపులు వేయించి నీటి సరఫరాను పునరుద్ధరించడం జరిగింది.
సమస్యను త్వరితగతిన పరిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, అధికారులకు టీడీపీ కార్యకర్తలు మరియు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.



