తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని, వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా తిరుపతి నగర మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రాలను ఆయన కమిటీకి సమర్పించారు.
16వ ఆర్థిక సంఘం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లతో సమానంగా పట్టణాభివృద్ధి సంస్థలకు కూడా నిధులు కేటాయించాలని, తద్వారా మాస్టర్ ప్లాన్ల అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే అవకాశం ఉంటుందని కోరారు.
తిరుపతి, తిరుచానూరు నగరాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి జాతీయ రహదారులను అనుసంధానిస్తూ 30 కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి ₹300 కోట్ల గ్రాంట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి పరిసరాల్లోని చెరువులు, కాలువల పునరుద్ధరణ మరియు వరద నివారణ చర్యల కోసం 'అమృత్' (AMRUT) పథకం కింద ₹200 కోట్లు కేటాయించాలని కోరారు.
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన సిటీ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు కింద తిరుపతిని చేర్చి, ₹5,000 కోట్ల నిధులు కేటాయించడం ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరారు.
2.7 కోట్లకు పైగా భక్తులు సందర్శించే తిరుపతిని దేశంలోని 17 ఐకానిక్ పర్యాటక కేంద్రాల జాబితాలో చేర్చాలని, తద్వారా పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు.
తిరుపతి ప్రాముఖ్యతను దృష్ట్యా కేంద్ర పథకాలైన PMAY, AMRUT వంటి వాటిలో అదనంగా 25% నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తుడా ఎటువంటి ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకుండా స్వయం ప్రతిపత్తితో అభివృద్ధి పనులు చేపడుతోందని, కేంద్రం నుండి తగిన నిధులు అందితే తిరుపతిని మరింతగా తీర్చిదిద్దవచ్చని ఈ సందర్భంగా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.





