
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మే 9:
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని మంత్రికి వివరించడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే పోడు భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లారం తండాకు సంబంధించిన రెవిన్యూ రికార్డుల సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని అభ్యర్థించారు.
దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు స్వంత ఇంటి కలను సాకారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.