నీటి సంరక్షణ పనులతో భూగర్భ జలాల పెంపే లక్ష్యం
జలధార పనులతో ఉపాధి హామీ వేతనదారులకు వరంగా మారిన వి బి జి రామ్ జి పథకం
తిరుపతి మన ధ్యాస మే 5.
భారత దేశంలో చెరువులు కేవలం నీటి వనరులే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, మానవ మనుగడకు, సంస్కృతి పరిరక్షణకు పట్టుకొమ్మలు. ఇవి నీటి నిల్వకు మాత్రమే కాకుండా వరదల ప్రభావం తగ్గించడానికి, పర్యావరణ సమతుల్యానికి, భూగర్భ జలాల సంరక్షణకు అత్యంత కీలకమైనవి.
గంగలపూడి చెరువు పునరుద్ధరణతో 150 ఎకరాల పంటలకు నీరు
శ్రీకాళహస్తి మండలంలో జలధార – జలహారతి కార్యక్రమం కింద మొత్తం 85 పనులను చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు. అందులో 77 ఫీడర్ చానల్స్, 8 నీటి సంరక్షణ కుంటల పనులు చేపట్టనున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని గంగలపూడి గ్రామ పంచాయతీలోని గంగలపూడి చెరువులో 30 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు, 1 మీటర్ లోతుతో రూ.4 లక్షల అంచనా వ్యయంతో నీటి సంరక్షణ కుంట పనిని 75 మంది ఉపాధి హామీ వేతనదారులతో గత 2 వారాలుగా చేపడుతున్నారు. వర్షాల వలన కురిసే నీరు పల్లాం చెరువు నిండి ఫీడర్ చానల్ ద్వారా గంగల పూడి చెరువుకు చేరుతుంది. ఈ చెరువు నిండడం ద్వారా 15 బోరు బావులు, 4 బావులు రీఛార్జ్ అవుతాయి. గంగలపూడి, వేలవేడు గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. ఈ నీటి ద్వారా 150 ఎకరాలలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఆ నీటి ద్వారా వరి, వేరుశెనగ పంటలను పండించుకుంటారు. జలధార పనులతో ఉపాధి హామీ వేతనదారులకు వి బి జి రామ్ జి పథకం వరంగా మారింది.
జలధార–జలహారతి తో నీటి నిల్వ, ఉపాధి హామీతో జీవనోపాధి
కోట చంద్రబాబు గంగల పూడి ఉపాధి హామీ వేతనదారుడు . . మాట్లాడుతూ జలధార-జలహారతి కార్యక్రమం కింద తాము నీటి సంరక్షణ కుంట పనిని చేస్తున్నామని ఈ పని తమకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో వర్షాలు పడినప్పుడు ఆ నీరు వృధా అయ్యేదని, ఈ చెరువులో ప్రస్తుతం నీటి సంరక్షణ పనిని చేపట్టడం వలన వర్షపు నీరు చేరి నీరు నిల్వ ఉంటుందన్నారు. నిల్వ ఉంచిన నీటి ద్వారా చెరువు పరిసర ప్రాంతాల లోని బోర్లలో నీటి మట్టం పెరగడంతో పాటు త్రాగు నీటి కొరత కూడా తీరుతుందన్నారు. గతం లో 100 రోజులు ఉన్న పని దినాలను విబి జి రామ్ జి పథకం కింద 125 రోజులకు పెంచడం వలన పెంచిన రోజులకు మాకు మరింత వేతనం లభిస్తుందన్నారు. ఈ పని చేయడం ద్వారా తమకు రోజుకు రూ.300 నుండి రూ.307 వరకు వేతనం అందుతోందన్నారు. ఈ పనులు కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.



