రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో వినతుల వెల్లువ! …
రేణిగుంట మే 4.
రేణిగుంట మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా పరిష్కార వేదిక' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండలంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట ఎమ్మార్వో శ్యామ్ ప్రసాద్ , ఎంపీడీవో రవిచంద్ర తో పాటు పోలీస్ శాఖ మరియు ఇతర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజా పరిష్కార వేదిక ద్వారా ప్రజల వద్ద నుండి స్వీకరించిన అర్జీలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు. ప్రజలు సమర్పించిన వినతులను ఏమాత్రం జాప్యం చేయకుండా, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 9 ఫిర్యాదులు అందగా, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 7 అర్జీలు, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 2 అర్జీలు ఉన్నాయని ఎమ్మార్వో వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు.

