
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో శివపంచాయతన అభయాంజనేయ క్షేత్రం చతుర్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం,పరివార దేవతల పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా,భక్తి పారవశ్యంతో నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలతో

మార్మోగుతూ,భక్తుల రాకపోకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ మహోత్సవం ఆలయ ధర్మకర్త మెంగారం నాగలక్ష్మి–శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో, గ్రామస్తుల సమిష్టి సహకారంతో అద్భుతంగా జరిగింది.భక్తులు హరహర మహాదేవ్ నినాదాలతో పాల్గొని,పరమేశ్వరుని ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ పురోహితులు మధుకర్ రావ్ పంతులు శాస్త్రోక్తంగా వేద విధానంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాకుండా, మనసును పరమాత్మలో లీనమయ్యే భావం.ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఆ భక్తి స్పూర్తి స్పష్టంగా కనిపించింది. దేవుడి సేవలో భాగమవడం, సమిష్టిగా పండుగను జరుపుకోవడం ద్వారా గ్రామస్తుల మధ్య ఐక్యత, ఆధ్యాత్మికత మరింత బలపడింది.ఈశ్వరుని కళ్యాణం చూడటం,వినటం వలన పుణ్యఫలం లభిస్తుందన్నారు విశ్వాసంతో భక్తులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా, భక్తులు శ్రద్ధతో స్వీకరించారు. అన్నదానం మహాదానం అన్న నానుడిని నిజం చేస్తూ,ఈ కార్యక్రమం కూడా భక్తి భావంతోనే కొనసాగింది.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ, “ఈశ్వరుని కళ్యాణం నిర్వహించడం పూర్వజన్మ సుకృతం. భక్తి మార్గం మనుష్యుడికి శాంతి, సుఖం, సంతోషాన్ని ఇస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామానికి శ్రేయస్సు తీసుకొస్తాయి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ మనోజ్ కుమార్,అచ్చంపేట సర్పంచ్ లక్ష్మయ్య,నాయకులు ప్రజా పండరి,మంద బలరాం,వెంకట్రాం రెడ్డి, జనార్ధన్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
