యాదమరి డిసెంబర్ 14 మన న్యూస్
పూతలపట్టు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతమైన యాదమరి మండలంలో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం యాదమరి మండలం, కాశిరాళ్ళ గ్రామం వద్ద జరిగిన యాదమరి - గుడియాత్తం రోడ్డు అభివృద్ధి పనులకు చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ఐఏఎస్ తో పాటుగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిధులుగా విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గోన్నారు. పూతలపట్టు నియోజకవర్గం నుండి విశేషంగా హాజరైన నాయకులు, కార్యకర్తలు, యాదమరి మండల ప్రజల నడుమ ఈ భూమి పూజ కార్యక్రమం పండుగ వాతావరణం జరిగింది. అయితే ఎమ్మెల్యే చొరవతో యాదమరి - గుడియాత్తం రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. యాదమరి ప్రజల ఐదేళ్ళ కళను నెరవేర్చిన ఎమ్మెల్యే మురళీమోహన్ కి యాదమరి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసారు. ఎన్నికలకు ముందు రోడ్డు కోసం గ్రామస్తులతో కలిసి నిరసన చేపట్టిన మురళీమోహన్ పై గత ప్రభుత్వం కేసులు కూడా పెట్టించింది. అయితే ఆ కేసులకు ఏ మాత్రం భయపడని మురళీమోహన్ తాను ఎమ్మెల్యే ఐన వెంటనే రోడ్డు సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మురళీమోహన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. యాదమరి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకూ మాట నిలబెట్టుకోవడం జరిగిందని, మొత్తం 7.10 కోట్ల రూపాయలతో యాదమరి రోడ్డు పనులు చేపడుతున్నామని, వీలైనంత త్వరగా యాదమరి - గుడియాత్తం రోడ్డును నిర్మిస్తామన్నారు. తన జీవితంలో మొట్టమొదటి కేసు ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతుంటే నమోదు అయిందని, దానికి తాను ఏమాత్రం భయపడకుండా పోరాటం సాగించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. యాదమరి మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలను ఆర్ధికంగా బలపరిచేందుకు అవసరమైన పరిశ్రమలు తీసుకొస్తానని, అందుకు కావాల్సిన ప్రతిపాదనను తయారు చేయడం జరిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు కి ఇచ్చిన మాట ప్రకారం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకై సమస్యలు పరిష్కారిస్తానని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం నాయకులు, అధికారులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గోన్నారు.