మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రకృతి సహజ సిద్ధంగా పండించిన రైతుల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుడు చేరాలని మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి అన్నారు.మండల పరిధిలోని రమణయ్యపేట గ్రామంలో ఏలేశ్వరం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో వ్యవసాయోత్పత్తుల ప్రదర్శన, అమ్మకం కేంద్రాన్ని ఎంపీపీ మంగళవారం ప్రారంభించారు. రైతు సాధికార సంస్థ (ఆర్ వై ఎస్ ఎస్), ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్ (ఎస్ ఈ ఆర్ పి)లో ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ బుజ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు భాగస్వాములు కావాలని అన్నారు. ప్రకృతి సాహస సిద్ధంగా పండించే పంటలు దళారుల చేతుల్లోకి వెళ్లకుండా మండల మహిళ సమైక్య నేరుగా వినియోగదారుడుకి చేర్చడం హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రతి వినియోగదారుడు ప్రకృతి సహజసిద్ధంగా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలు రైతులు ఆచరించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయటం ద్వారా రైతులు అధిక లాభాలను పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జి, లింగంపర్తి పిఎసిఎస్ మాజీ చైర్మన్ చిక్కాల లక్ష్మణరావు, రమణయ్య పేట ఎన్డీఏ కూటమి నాయకులు చల్ల రాజారావు, ముదర కామరాజు, బోర సత్యనారాయణ, హార్టికల్చర్ సిబ్బంది, మండల మహిళా సమైక్య సభ్యులు , రైతులు పాల్గొన్నారు.