మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సుమారు 20 నెలల కాలం పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకపోవడం అత్యంత దురదృష్టకరం మరియు ప్రజావ్యతిరేక చర్యగా భావించాల్సి వస్తోంది.ప్రత్యేకంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు మరియు ఇతర అర్హులైన వర్గాలు పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్నప్పటికీ,కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక,మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవన వ్యయం రోజురోజుకు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేద ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకున్నారు.పెన్షన్ అనేది దయాదాక్షిణ్యం కాదు, అర్హులైన పౌరుల హక్కు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత ఉండాల్సిందే. అయినప్పటికీ, ఇప్పటివరకు ఈ అంశంపై స్పష్టమైన చర్యలు లేకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.
అందువల్ల, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి,
అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని,
పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి న్యాయం చేయాలని,పెన్షన్ మంజూరులో జరుగుతున్న ఆలస్యానికి కారణాలు వెల్లడించాలనిమేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.ఈ వినతికి ప్రభుత్వం స్పందించకపోతే, జై భీమ్ రావ్ భారత్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపట్టాల్సి వస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాము.కావున, ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.