
యాదమరి, మన ధ్యాస ఫిబ్రవరి-09: యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కె. గొల్లపల్లి నందు ఎస్టీయూ సంఘం రూపొందించిన కరపత్రికను ఈరోజు సాయంత్రం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.పి. లలిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్.ఆర్. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి, ముప్పై శాతం మధ్యంతర భృతిని మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రెండువేల నాలుగు సెప్టెంబర్‌కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన రెండువేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులను కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్ యాభై ఏడు ప్రకారం పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత పదిహేను నెలలుగా రిటైర్ అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ, సరెండర్ లీవు బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డి.ఎలను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జనవరి ముప్పై తేదీన తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి పదమూడు తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నామని, అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు సుల్తాన్, యాదమరి మండల శాఖ ప్రధాన కార్యదర్శి రంగనాథం, సిపిఎస్ కన్వీనర్ నాగభూషణం, ఉపాధ్యాయులు చిన్న దొరై, రాకేష్, రాజా, దామోదర్ రెడ్డి, మధుసూదన్, భాస్కర్ రెడ్డి, హేమంత్, ఎం. భారతి, ఎన్.ఎస్. అరుణ, రమాదేవి, మంజులత, అరుణ, హిమబిందు, కె. భారతి, ఆషా, షర్మిల తదితరులు పాల్గొన్నారు.
