మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులపై దాడులు జరగడాన్ని సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మాజీ మంత్రి,బీసీ నాయకురాలు విడదల రజని పైనా, శనివారం మాజీమంత్రి అంబటి రాంబాబు పైనా తెలుగు దేశం రౌడీ మూకలు దాడికి ప్రయత్నించడం అత్యంత హేయమైన చర్యలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేసి గెలిపించింది ప్రతిపక్షాలను,అమాయక ప్రజలను దండించమని దాడులు చేయమని కాదని ఈ వాస్తవాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు గమనించుకోవాలని ముద్రగడ వ్యాఖ్యానించారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఈరోజు తమకు అధికారం ఉందని ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్నారు.అధికారం శాశ్వతం కాదు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం మారినప్పుడు ఇప్పుడు దాడులు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భవిష్యత్తులో మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి తిరిగి దాడులు జరిపితే అప్పుడు తమ కార్యకర్తల గతి ఏంటి అనే ఆలోచన సీనియర్ ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు.అధికార పార్టీ పాలన సవ్యంగా లేనప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ,నాయకులు,సమస్యలపై ఆందోళనలు చేసి నిరసన తెలియజేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. తమరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదా ? రాష్ట్రం మీ ఎస్టేట్ కాదు. ప్రజలు బానిసలు కాదు. మిమ్మల్ని మీ పార్టీని నమ్ముకున్న వారి ని మీరు ఎల్లప్పుడూ కాపాడగలరా? రాక్షస పాలన మీరు జరిపితే అదే తరహా పాలన మీతో పాటు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు చవి చూడవలసి వస్తుంది. బ్రిటిష్ పాలన లో కూడా ఇప్పుడు మీరు చేస్తున్న పరిపాలన తీరు జరిగిన దాఖలాలులేవు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిగా పరిపాలన సాగించండి. ప్రజలు తిరగబడితే పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి అని ముద్రగడ పద్మనాభ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితవు పలికారు.