
మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలి.-నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి మద్దూర్ మున్సిపాలిటీలలో నామినేషన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మక్తల్ 16 మున్సిపాలిటీ వార్డు లకు సంబంధించి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం రెండవ రోజు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మక్తల్ మున్సిఫల్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యం అని తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు రవాణా, సరఫరా చేయరాదని, ఒకవేళ చేస్తే వాటిని ఎన్నికల నిబంధనల మేరకు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఎన్నికలలో పాల్గొనే వివిధ రాజకీయ పార్టీల నాయకులు ర్యాలీలకు మరియు వాహనాల మైక్ పర్మిషన్లు డిఎస్పి ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు.నామినేషన్ కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సి ఆర్ పి సి )అమలులో ఉన్నదని, అలాగే నామినేషన్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాహనాలు ఉండాలని, 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదు అని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల్లో ప్రవేశించే వ్యక్తుల సంఖ్య ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రజలు మరియు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.జిల్లాలో గత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఈ మున్సిపాలిటీ ఎన్నికల కూడా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు.ఈ పరిశీలనలో స్థానిక అధికారులు మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్ బి ఎస్సై నరేష్, ఎస్ఐ లు భాగ్య లక్ష్మి రెడ్డి, ఎస్ ఎం నవీద్, మున్సిపల్ కమిషనర్ రాములు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
