
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్’ గా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. వీబీ జీ రామ్ జీను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు, విలువల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.మొదటి నుంచే ఈ పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతోందన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, ప్రజలకు ఉపాధి హక్కును, గ్రామ పంచాయతీలకు పాలనా హక్కులను తిరిగి కల్పించాలని డిమాండ్ చేశారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తూ,గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.గతంలో ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పని హక్కు ఉండేదని,ప్రస్తుతం వీబీ జీ రామ్ జీ చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి బడ్జెట్ కేటాయించినప్పుడే పని లభించే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు.ఇది ప్రమాదకరమైన విధాన మార్పు అని స్పష్టం చేశారు.
ఇది గ్రామీణ పేదల సంక్షేమాన్ని దెబ్బతీసే తిరోగమన చర్య అని అభివర్ణించారు.ముఖ్యంగా పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.ఇది కేవలం పేరు మార్పు కాదని.. గాంధీజీ స్ఫూర్తితో వచ్చిన ఈ పథకం తాత్విక పునాదులపై చేసిన దాడి అని ఆరోపించారు.గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, సమాజంలోని చివరి వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన ఆశయాలకు ఈ చట్టం ప్రతీక అని గుర్తుచేశారు.ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో అసంఘటిత కార్మికుల వేతనాల భారాన్ని దాదాపుగా కేంద్రమే భరిస్తుండగా,కొత్త విధానంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాలని ప్రతిపాదించారు.దీని వల్ల పేద రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని,వేతనాల చెల్లింపులో జాప్యం జరిగి పథకం నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు గ్రామీణ పేదలను, రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉందని ఆక్షేపించారు.ఉపాధి హామీ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధార స్తంభం వంటిదని,దీనిని బలహీనపరచడం దేశాభివృద్ధికి ఏ మాత్రం మంచిది కాదని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
