
మదనపల్లి, మన ధ్యాస ప్రతినిధి:
మదనపల్లి జిల్లా కేంద్రంగా అవతరించేందుకు కీలక పాత్ర పోషించిన మదనపల్లి జిల్లా సాధన కమిటీ కన్వీనర్, బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్‌ను మదనపల్లిలోని బాస్ కార్యాలయంలో శనివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, పీలేరు నియోజకవర్గానికి చెందిన ప్రజా సంఘాల నాయకులు, మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి చంద్రయ్య, MSP పార్టీ సీనియర్ నాయకులు నడిమి కండ్రిక సుధాకర్ బాబులు పాల్గొని శివప్రసాద్‌కు శాలువా కప్పి, బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మదనపల్లి జిల్లా సాధన కోసం 633 రోజుల పాటు నిరంతర ఉద్యమం నిర్వహించడం గొప్ప విషయమని, ప్రజల ఆకాంక్షను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో పీటీఎం శివప్రసాద్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగిన పోరాటం ప్రజల ఆశయాలకు బలమైందని పేర్కొన్నారు.అలాగే, 114 సంవత్సరాలుగా మదనపల్లి ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన జిల్లా కేంద్రం అంశాన్ని అసెంబ్లీలో అనేక సందర్భాల్లో ప్రస్తావించి, మదనపల్లి జిల్లా కేంద్రంగా అవతరించేందుకు తన వంతు కృషి చేసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘ నాయకులు ఇరపలపాటి ఆంజనేయులు, కిన్నెర తిమ్మయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.