
మన ధ్యాస, నెల్లూరు, జనవరి 1:జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన నిర్ణయమని రాష్ట్ర ధర్మాదాయ,దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని బలవంతంగా కట్టడి చేసినా, ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకపోయినా చివరికి దుష్పరిణామాలే ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని సంతపేట లో ఉన్న ఆనం క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఉదయం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో అధికారులు రాజకీయ నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు ఆనం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ....... రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాల వల్ల అనేక పరిపాలనా సమస్యలు తలెత్తాయని, ప్రజలకు సేవలు అందడంలో ఆటంకాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఆ లోపాలను సరిదిద్దేందుకే ప్రస్తుత ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు.జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నామని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అభిప్రాయాలు సేకరించిన అనంతరమే తుది నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. జిల్లాల పునర్విభజనతో పరిపాలనా ఖర్చులు తగ్గడమే కాకుండా, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయని అన్నారు.ఆర్థిక అంశాలపై కూడా ఆయన వివరాలు వెల్లడించారు. గత పాలనలో అనవసర ఖర్చులు, ఆర్థిక అస్తవ్యస్తత వల్ల రాష్ట్ర ఖజానాపై భారమైందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి సారించిందని, ప్రజలకు భారం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజల మద్దతు అవసరమని, రాజకీయ లాభనష్టాలకు అతీతంగా సమిష్టి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజన అంశంలో కూడా ప్రజలే కేంద్రబిందువుగా ఉంటారని, ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు.

