మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి మేలు చేయడమే కాక పర్యావరణానికి మేలు కలుగుతుందని ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతం అన్నారు.ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ సిబ్బంది,యువకులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతం మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫిట్ ఇండియా కార్యక్రమానికి పిలుపునిచ్చాయని,ఇందులో భాగంగా ప్రతి ఆదివారం సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహిస్తుందన్నారు.ప్రస్తుతం మనమందరి జీవన శైలిలో ప్రతిరోజూ ఎక్కువగా మోటార్ సైకిళ్లు,కార్లలో ప్రయాణించడం జరుగుతుందని,ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ,శారీరక చురుకుదనం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు.మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం,ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం ప్రస్తుత కాలంలో అత్యంత ముఖ్యమని,అందులో భాగంగా తమ దైనందిన జీవనశైలిలో కొంత సమయం సైక్లింగ్ ను అలవాటుగా చేసుకుని శారీరక దృఢత్వం,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.పోలీస్ సిబ్బంది ప్రతి రోజు విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని,అలాంటి సమయంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం తప్పనిసరని,కావున సైక్లింగ్ ను అలవాటుగా చేసుకుని శారీరక దఢత్వం,ఆరోగ్యాన్ని కాపాడుకోడమే ఈ కార్యక్రమం ముఖ్యోదేశమని తెలిపారు.