
మన ధ్యాస, కావలి, డిసెంబర్ 26:ఒక నాయకుడు మరణించి దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడంటే, ఆయన ప్రజల కోసం చేసిన సేవలే కారణం అని రంగా అభిమానులు పేర్కొన్నారు. బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం కుల, మత, ప్రాంతాలకతీతంగా జీవితాంతం పోరాటంచేసిన మహానేత వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా కావలి నడిబడ్డులో రైతుబజార్ వద్ద ఏర్పాటు చేసిన రంగా కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. కావలి ట్రంక్ రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేసి అభిమానులు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. వంగవీటి మోహన రంగా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన ప్రజానేత అని కొనియాడారు. 1970–80 దశకాల్లో విజయవాడ కేంద్రంగా సామాజిక అన్యాయాలు, రౌడీయిజం, దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన రంగా, కులం, ప్రాంతం చూడకుండా అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరి పక్షాన నిలిచారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలే ఈ రోజుకీ ప్రజల హృదయాల్లో ఆయనను జీవింపజేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎదిగిన క్రమంలో రంగా సాధించిన విజయాలు చారిత్రాత్మకమని వక్తలు తెలిపారు. 1982లో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జైలు గోడల మధ్య నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ప్రచారం లేకుండానే అత్యధిక మెజారిటీతో గెలిచిన అరుదైన నేతగా రంగా భారత రాజకీయ చరిత్రలో నిలిచారని వివరించారు. ఇది ఆయనపై ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసానికి నిదర్శనమన్నారు. కావలి నడిబడ్డులో రంగా కాంస్య విగ్రహాన్ని గత ఏడాది ఏర్పాటు చేయడం పట్టణానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేశారని తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అప్పటి మంత్రులు పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు పాల్గొనడం విశేషమన్నారు. రంగా ను ఏ ఒక్క కులానికి పరిమితం చేయకుండా, అన్ని వర్గాల నాయకుడిగా భావించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. పేదల పక్షాన నిలబడి, అన్యాయానికి ఎదురొడ్డి పోరాడిన రంగా బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన నిర్వాహక కమిటీ సభ్యులకు, హాజరైన నాయకులకు, ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వర్ధంతి కార్యక్రమంలో రంగా విగ్రహ కమిటీ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, దగుమాటి మాల్యాద్రి రెడ్డి, సీనియర్ టీడీపీ నాయకురాలు పద్మావతి శ్రీదేవి, ఏఎంసి డైరెక్టర్ కొప్పోలు లక్ష్మి, పసుపులేటి బాబురావు, ఓగిరాల సుధాకర్, పట్టణ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసులు, మామిడాల సాయి కుమార్, పాలడుగు వెంకటేశ్వర రావు, పాపిశెట్టి జానకి రామ్, బండికోటి చలపతి రావు, జనసేన కావలి పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి విఠల్, కుల, మత, ప్రాంత, పార్టీ భేదాలు లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు, రంగా అభిమానులు పాల్గొన్నారు.



