
అధికారం చేపట్టిన తరువాత సుమారు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా.దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించా.. ప్రజలకు దగ్గరయ్యా.విద్య, ఆరోగ్యం వైపు ప్రత్యేక దృష్టి సాధించా.పనిగట్టుకొని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు.. ప్రతిఘటిస్తా.25 సంవత్సరాలు ఇక్కడే ఉంటా ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసి చూపిస్తా
నెల్లూరు డిసెంబర్ 20, మన ధ్యాస న్యూస్, (కె నాగరాజు).

మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు వెల్లలు దాటి వచ్చానని, అభివృద్ధి చేసి చూపించి ఎంతోమంది జీవితాలను మారుస్తానని, అభివృద్ధికి అడ్డు వచ్చిన వారిని.. తొక్కుకుంటూ ముందుకు వెళ్తానని, ఇప్పటికే 300 కోట్ల రూపాయలతో ఉదయగిరిని అభివృద్ధి చేశానని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం నెల్లూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో సుమారు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పూర్తి చేసినట్లు తెలిపారు. మరి కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉందన్నారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణానికి 150 కోట్లు వెచ్చించి రహదారి పనులు మరియు అనుసంధానం బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలలో అవసరమైన చోట్ల రోడ్లు, రహదారి అనుసంధానం రోడ్లు, బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మారుమూల గ్రామాలకు సైతం రహదారిని ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024- 25 సంవత్సరానికి 510 పనులకు 29 కోట్ల 69 లక్షల రూపాయలతో 2025- 26 సంవత్సరానికి 186 పనులకు 15 కోట్ల 94 లక్షల రూపాయలతో మొత్తం 45 కోట్ల తో ఎనిమిది మండలాలలోని 143 పంచాయతీలలో అంతర్గత సిమెంట్ రోడ్లను ఏర్పాటుచేసుకోవడం జరిగిందన్నారు.అంతేకాకుండా ఆరోగ్య రంగం వైపు ప్రత్యేక దృష్టి సాధించి ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి 5. 50 కోట్లు నిధులు రాబట్టడం జరిగిందన్నారు. వింజమూరు సిహెచ్ సీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. పెద్దిరెడ్డిపల్లి, కొండాపురం పంచాయతీలకు విలేజ్ హెల్త్ క్లినిక్ ల కోసం 72 లక్షలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మౌలిక వసతుల కోసం వింజమూరులో ఒక కోటి 75 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం, నుడా నిధుల ద్వారా జరుగుతుందన్నారు. అదేవిధంగా వింజమూరు మండల కేంద్రంలో అన్న క్యాంటీన్, ఏడు పంచాయతీలలో పంచాయతీ భవనాలు, నియోజకవర్గ వ్యాప్తంగా 21 సెల్ టవర్స్, మూడు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకో బోతున్నాము అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి త్రీఫేస్ సప్లై 24 గంటలు అందించేదానికి విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం నూతనంగా 1557 విద్యుత్ కనెక్షన్లకు గాను 248 ట్రాన్స్ఫార్మర్లను ఉచితంగా అమర్చడం జరిగిందన్నారు. దీనికి సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. విద్యారంగం అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ సహకారంతో 20 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం మూడు కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా గండిపాలెం పాఠశాలకు ఒక కోటి 75 లక్షలు, ఉదయగిరి డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల రూపాయలు, వసతి గృహాలకు 80 లక్షలు, సీతారాంపురం దుత్తలూరు కలిగిరి కొండాపురం మండలాలలో కస్తూర్బా విద్యాలయాల భవనాలకు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఉదయగిరిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని కలిగిరి మండలంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఎం ఎస్ ఎం ఈ పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చింతల దేవి కామదేను బ్రీడింగ్ సెంటర్ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 60 గ్రామాల్లో త్రాగునీటి కోసం ఐదు కోట్లు వ్యయంతో ఆర్ ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవి కాకుండా 67 కోట్ల రూపాయలతో సోమశిల ఉత్తర కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని చెరువులకు ఏడు కోట్ల 50 లక్షల రూపాయలతో పనులు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రిజర్వాయర్ మరియు చెరువుల కాలువల అభివృద్ధిని వేగవంతంగా చేసి రైతులకు సాగునీరు అందించామన్నారు. ఇవి కాకుండా ఆలయాల అభివృద్ధి కోసం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనల సిద్ధం చేసుకుని 8.5 కోట్ల రూపాయలను మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. శ్రీ వెంగమాంబ తల్లి ఉదయగిరి కోట ఘటక సిద్దేశ్వరాన్ని అనుసంధానం చేస్తూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు శ్రమిస్తున్నానన్నారు.ప్రతినిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తుంటే నాపై కొంతమంది కుట్ర పూని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, వారికి దీటుగా సమాధానం చెప్తానన్నారు. నాకు ఎలాంటి సంబంధం లేని వాటిని నాపై నెట్టి నన్ను ఆబాసు పాలు చేసి వారు రాజకీయం చేయాలని అనుకుంటున్నారని అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవని, జలదంకి మండలం గట్టుపల్లి కి చెందిన ప్రసాద్ నాయుడు హత్య కేసు వెనుక ఎవరు ఉన్న ఉపేక్షించేది లేదని, ఇప్పటికే ముద్దాయిలు జైలుకు వెళ్లారని, ఎమ్మెల్యే తెలిపారు. జామాయిల్, ఎర్ర చందనం, నరికిన వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందని, ఆ విషయం పోలీసు వారిని అడిగితే చెప్తారు అన్నారు. భయం, పక్షపాతం లేకుండా అందరికీ న్యాయం చేస్తున్నానని, నన్ను భయపెట్టాలని చూస్తే, వారిని పారిపోయే విధంగా చేస్తానని, నేను ఎక్కడికి వెళ్ళనని 25 సంవత్సరాలపాటు ఉదయగిరి అభివృద్ధిలో భాగమై, ఎంతోమంది జీవితాలను మారుస్తానని తెలిపారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ద్వారానే చదువును పూర్తి చేశానని ఉద్యోగం సంపాదించుకున్నానని, పార్టీ విధేయుడుగా వచ్చి, పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మంత్రి నారా లోకేష్ కి, మంత్రివర్గానికి మరియు సహచర ఎమ్మెల్యేలకు జిల్లా నాయకులకు, ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కి, మేకపాటి శాంత కుమారి కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జెడ్పి చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఎల్ సి రమణారెడ్డి, ఎనిమిది మండలాల కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు,ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు*