
రుచిగా లేకపోవడంతో మందలింపు
మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- మామిడిపల్లి హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు మంచి రుచికరమైన భోజనం పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కి పిర్యాదు అందటంతో మండల స్థాయి అధికారులు శనివారం వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్దులకు రుచి కరమైన ఆహారం ఇవ్వటం లేదని గుర్తించి, మందలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముంగారమ్మ మహిళా సంఘం ప్రతినిధి అనసూయ తోపాటు కొంతమంది విద్యార్దులు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో పిర్యాదు చేసారు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా వండటంతో ఆహార పదార్థాలు రుచిగా లేవని, దీనివల్ల విద్యార్దులు సరిగ్గా తినటం లేదని, పలితంగా అనారోగ్యం పాలవుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. తనకందిన పిర్యాదు పై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే దర్యాప్తు చెయ్యాలని మండల అధికారులను ఆదేశించారు. దానితో అధికారుల బృందం కదిలింది. తహశీల్దార్ నీలకంఠ రావు, ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి, ఎంఈఓ నల్ల ఆనందరావు(పాఠశాల హెచ్ఎం)లు శనివారం ఉదయం హైస్కూల్ కి వెళ్లి అప్పటికే విద్యార్దుల కోసం వండి పెట్టిన ఆహార పదార్థాలను పరిశీలించారు. అలాగే విద్యార్దులు, ఉపాధ్యాయులు, మధ్యహ్న బోజన పథకం నిర్వాహకులతో వేరు, వేరుగా మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ఈ సందర్భంగా వంటకాలు బాగాలేవని, రుచిగా లేవని, కూరలు సరిగ్గా ఉడక లేదని గుర్తించి, మీ ఇళ్ళల్లో పిల్లలకు ఇలాగే వండి పెడతారా అని నిర్వాహకులను మందలించారు. విద్యార్థులకు శుచితో కూడిన రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయమై ఇన్చార్జ్ ఎంఈఓ నల్ల ఆనందరావు విలేఖరులతో మాట్లాడుతూ అనసూయ అనే వ్యక్తి గతంలో మధ్యహ్న భోజన పథకం నిర్వహకురాలుగా ఉండే వారన్నారు. ప్రస్తుతం వంట చేస్తున్న వారికి, ఆమెకు మద్య విభేదాలు ఉన్నాయని, అందువల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. అనంతరం ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి మాట్లాడుతూ కూరలు, చారు ఏమాత్రం బాగలేవన్నారు. నేను గతంలో చాలా పాఠశాలలకు వెళ్లి పరిశీలించానని ఇంత అధ్వాన్నంగా ఎక్కడా లేదన్నారు. ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు.