
చిత్తూరు, మన ధ్యాస, డిసెంబరు-5: ఎస్టియు చిత్తూరు జిల్లా శాఖాధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 7వ తేదీ, ఆదివారం నాడు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థలు, పుత్తూరు రోడ్డు, హెరిటేజ్ పార్లర్ సమీపంలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గ ఎన్నికలు చేపట్టబడనున్నాయి. ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు బాలగంగి రెడ్డి, ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లాకు చెందిన ఎస్టియు అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒకే ఒక డి.ఏ మంజూరు చేసిన నేపథ్యంలో, పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పన్నెండో వేతన సంఘం చైర్మన్ నియామకం, ముప్పై శాతం మధ్యంతర భృతి, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన సుమారు ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిల విడుదల, ఉమ్మడి సేవా నియమావళి అమలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు, పి.ఎఫ్ మరియు ఏ.పీ.జి.ఎల్.ఐ రుణాల మంజూరు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, సంక్రాంతి పండుగకు ముందుగా సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితిలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి గంటా మోహన్, రాష్ట్ర కార్యదర్శులు హేమచంద్రారెడ్డి, ము. మునెప్ప, పురుషోత్తం, దేవరాజు రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. అందువల్ల మండల, జిల్లా ఎస్టియు నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్రికా ప్రకటనలో కోరడమైనది.