
యాదమరి, స్వర్ణసాగరం, డిసెంబరు-5: యాదమరి మండలంలోని వరిగపల్లె ప్రాధమిక పాఠశాలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా సాగింది. హెచ్.యం. జె. హిమబిందు సమన్వయంతో జరిగిన ఈ సమావేశం పాఠశాలలో విద్యార్థుల అభ్యాసం, సంక్షేమం, అభివృద్ధి పై తల్లిదండ్రుల్లో చైతన్యం పెంపొందించే వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ నాయకులు, వార్డు ఇన్చార్జి లక్ష్మీపతి, పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మీ, వైస్ చైర్మన్ శోభరాణి హాజరై విద్యా ప్రాధాన్యతను వివరించారు. హెచ్.యం. హిమబిందు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డోక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, తల్లికి వందనం వంటి పథకాలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి బలంగా దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగేందుకు ఉపాధ్యాయులు–తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని ఆమె సూచించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల చురుకైన పాత్ర ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. సమావేశం అనంతరం తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి రుచికరమైన భోజనాన్ని చేసుకుని స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలోపేతం చేశారు. వైస్ చైర్మన్ శోభరాణి విద్యార్థులకు అరటిపండ్లు అందజేశారు. కార్యక్రమం విజయవంతంగా జరగడానికి టీచర్ అఖిలాండేశ్వరి, తల్లిదండ్రులు ప్రత్యేకంగా సహకరించారు. వరిగపల్లె పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ విద్యార్ధుల భవిష్యత్తుకు నూతన దిశగా నిలిచింది.
