
మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి*నార్త్- రాజుపాళెం హై స్కూల్ లో అత్యవసర మౌలిక వసతుల కోసం విపిఆర్ ఫాండేషన్ ద్వారా 15 లక్షల సహాయం. - హై స్కూల్ అభివృద్ధికి తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మెన్ క్రిష్ణయ్యకు ధన్యవాదాలు. మన ధ్యాస, కొడవలూరు, డిసెంబర్ 5:మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ తో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒకే వేదిక పై తీసుకోచ్చేలా కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖా మంత్రి లోకేష్ కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలియచేసారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొనేందుకై కొడవలూరు మండలం రాజుపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. హై స్కూల్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన ఆమె తరగతి గదులలోనికి వెళ్లి విద్యార్థినీ, విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ కళాకృతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ....... ప్రభుత్వ విద్యా వ్యవస్థ పనితీరు మెరుగు పడాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సమన్వయం వుండాలన్నారు. రాజుపాళెం హైస్కూలులో అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకై విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మెన్ ఐఏఎస్ అధికారి పివి కృష్ణయ్య రాజుపాళెం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధేనని పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. 300 కు పైగా విద్యార్థినీ, విద్యార్థులు విద్యనభ్యసించే ఈ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలునిచ్చారు. పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, తల్లి తండ్రులదే కీలక పాత్రన్నారు.తల్లి తండ్రులు పిల్లల కోసం కొంచెం సమయం వెచ్చించి వారి బాగోగులు తెలుసుకోవడంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిని విద్యను అందించాలని ఆమె అధ్యాపకులను కోరారు. పిల్లలకు నైతిక విలువలు బోధించేందుకు ఒక టీచర్ ను కేటాయించి ప్రత్యేక క్లాస్ నిర్వహించాలని ఆమె సూచించారు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకునే మంచి చెడులపై స్వీయ విశ్లేషణ చేసుకొని మంచిని మాత్రమే స్వీకరించాలని పిల్లలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రి లోకేష్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారనన్నారు. క్లాస్ కు ఒక టీచర్ విధానం, నాణ్యమైన సన్న బియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట కిట్స్, యూనిఫామ్స్ అందచేసి ఆదర్శ ప్రాయంగా నిలిచారన్నారు. ప్రాధమిక విద్య అభ్యసించే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అందచేశామన్నారు. అధికారులతో మాట్లాడి స్లాబ్ లీకేజీలను అరికట్టడంలో పాటు అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ యిచ్చారు. తల్లి దండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని విద్యార్థులకు ఆమె హితోపదేశం చేశారు. క్రమశిక్షణతో చదువుకుంటూ ఉత్తమ విద్యార్థులుగా రాణించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విద్యార్థినీ, విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు స్ఫూర్తి రెడ్డి, ఎంపీడీవో సుబ్బారావు, హై స్కూల్ హెడ్ మాస్టర్ ఓబులేసు, ఎంఈఓ 1 ప్రసన్నకుమారి, ఎంఈఓ 2 అంకయ్య తదితరులు పాల్గొన్నారు.







