
తవణంపల్లె, స్వర్ణసాగరం డిసెంబరు-01: చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలంలోని ఎగువ మారేడుపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మహాదేశ్వర స్వామి ఆలయం భక్తిశ్రద్ధలతో అభివృద్ధి చెందుతోంది. 21.02.2020 మహాశివరాత్రి నాడు స్వయంభూగా వెలిసిన ఈ శివలింగం దర్శించడానికి తిరువన్నామలై గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులు, గ్రామస్తులు, బెంగళూరు–తిరుపతి–చిత్తూరు ప్రాంతాల వాస్తవ్యులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి నాడు అభిషేకాలు, చందన అలంకారం, ధూప–దీప–నైవేద్యాలు నిర్వహిస్తూ భక్తులు స్వామి సేవలో పాల్గొంటున్నారు. గత ఆరు సంవత్సరాలుగా కార్తీక దీపోత్సవం, మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక ఉత్సవాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ నిత్య పూజలను స్థానిక భక్తుడు మురళి నిర్వహిస్తున్నారు.
స్థల పురాణం:
స్థానిక భక్తుడు బాలాజీ అచారీ చిన్నతనం నుంచే ఆధ్యాత్మికతపై ఆసక్తి కనబరిచేవారు. తరచూ తిరువన్నామలై గిరిప్రదక్షిణ సమయంలో ధ్యానంలో మారేడుపల్లి కొండ ప్రాంతంలో శివస్వరూపం ఉన్నట్లు ఆయనకు దర్శనమిచ్చేది. కాలక్రమంలో మురళి అనే స్థానిక భక్తుడి పరిచయం వలన ఆ ప్రదేశం గురించిన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2020 మహాశివరాత్రి నాడు ధ్యానస్ఫూర్తితో కొండపై దొరికిన సర్పరూపంలో పాలించే స్వయంభూ శివలింగాన్ని భక్తులు కిందకు తీసుకువచ్చి, సాంప్రదాయబద్ధంగా ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆలయం అభివృద్ధి చెందుతూ, భక్తులు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
ప్రతిష్ట అనంతర అద్భుతాలు: భక్తుల వాంగ్మూలాల ప్రకారం— సంతానం లేని వారికి సంతానం లభించడం, పెళ్లి కానివారికి వివాహాలు జరగడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు రావడం, వంటి అనుభవాలు భక్తుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచాయి. ప్రతి పౌర్ణమి, ప్రతి శివరాత్రి, ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి.

స్వయంభూగా వెలిసిన శివలింగం