
ఉదయగిరిలో 21 కొత్త బి ఎస్ ఎన్ ఎల్ టవర్లకు పచ్చ జెండా – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముందడుగు ఇంకా 20 గ్రామాలకు కొత్త టవర్ల ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కాకర్ల హామీ సిగ్నల్ లేని గ్రామాలపై ఫోకస్ – టవర్ నిర్మాణానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం
వింజమూరు నవంబర్ 29, మన ధ్యాస న్యూస్(కె ఎన్ రాజు)://

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు మరియు ఉదయగిరి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాల ఎమ్మార్వోలతో సమగ్ర సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గంలో మొబైల్ నెట్వర్క్ సమస్యలు, ప్రత్యేకించి సిగ్నల్ అందని గ్రామాలపై విస్తృతంగా చర్చ జరిగింది.సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక పథకం కింద బి ఎస్ ఎన్ ఎల్ సంస్థ ఇటీవల చేసిన సర్వేలో మొత్తం 21 గ్రామాలలో కొత్త సెల్ టవర్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలను బి ఎస్ ఎన్ ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎమ్. శ్రీనివాస్ గారు,డి.ఇ కావలి ఎస్ వి సాయికుమార్ , డి.ఇ.సి.ఎం సి. భాస్కర్, డి.ఇ ప్లానింగ్ కె.రమేశ్, ఉదయగిరి టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యురాలు తాటికొండ అనూష ఎమ్మెల్యే కి తెలియజేశారు.ఈ 21 టవర్ల నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు సర్టిఫికేట్లు మరియు సంబంధిత రెవెన్యూ శాఖ అధికారుల ఆమోదాలు త్వరగా అందించేలా సహకరించాలని వారు ఎమ్మెల్యే ని కోరారు.అందుకు ప్రతిస్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇంకా సిగ్నల్ సమస్యలు కొనసాగుతున్న సుమారు 20 గ్రామాలకు అదనంగా కొత్త టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిపారు.ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, టవర్ల కోసం అవసరమైన అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అదేకాలంలో, బి ఎస్ ఎన్ ఎల్ కి అవసరమైన భూమి మంజూరు సర్టిఫికేట్లు వెంటనే జారీ చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు స్పష్టమైన నిర్దేశాలు చేశారు. ఉదయగిరి ప్రజలకు మెరుగైన మొబైల్ కనెక్టివిటీ అందించడమే ఈ సమావేశము యొక్క ప్రధాన ఉద్దేశమని చెప్పారు.ఈ సమావేశంలో అన్ని మండలాల ఎమ్మార్వోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు
