
🔹అన్నవరం గేటు వద్ద నీటి విడుదల—రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందన్న ఎమ్మెల్యే కాకర్ల..!
జలదంకి నవంబర్ 25 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి://

ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా రబీ పంటలకు నీటి సరఫరా సమృద్ధిగా అందించే దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. జలదంకి మండలం అన్నవరం గ్రామం సమీపంలోని చిన్నక్రాక బ్యాలెన్సింగ్ గేటు నుండి దిగువ ప్రాంతాలైన బ్రాహ్మణక్రాక మేజర్, గౌరవరం మేజర్ కాల్వలు మరియు కావలి పెద్ద చెరువుకు రెండవ విడతగా నీటిని విడుదల చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , సతీమణి కాకర్ల ప్రవీణ హాజరయ్యారు. వారు స్వయంగా గేట్లను ఎత్తి పంటభూముల కోసం నీటిని విడుదల చేయడం ద్వారా రైతులకు ఎంతో నమ్మకం మరియు ఆనందాన్ని కలిగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ—రైతుల సమస్యలను అర్థం చేసుకొని, వారికి అండగా నిలబడటం మా కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రైతుల కళ్లల్లో కనిపించిన ఆనందం మా ప్రయత్నాలకు నిదర్శనం. ఇది నిజమైన రైతు ప్రభుత్వం” అని తెలిపారు.అలాగే, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రెండు విడతలలో 14,000 రూపాయలను అందజేస్తూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవలను ఆయన ప్రశంసించారు.రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న మరిన్ని సానుకూల చర్యలను ప్రస్తావిస్తూ—బిందు సేద్యానికి 90% వరకు సబ్సిడీ అందిస్తున్నామనీ, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఎన్నో సంస్కరణలను అమలు చేస్తున్నామనీ ఎమ్మెల్యే తెలియజేశారు.రైతుల సంక్షేమం కోసం ప్రతి అడుగులోనూ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి మరియు వ్యవసాయ రంగ ప్రగతి కోసం నిరంతరం పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
